కరువు నేలలో పారే జల సవ్వడిలో.. బీడు భూముల్లో పండే పంట సిరుల్లో.. రైతన్న మోములో వికసించే చిరునవ్వులో..
సీమను సస్యశ్యామలం చేసి జనం గుండెల్లో నిలిచిన వైఎస్సార్.. నిను ఎన్నటికీ మరువలేం
నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి
కరువు నేలలో జలసిరులు
కృష్ణగిరి: జిల్లాలో నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీ – నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్ పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55 కోట్లతో తాగునీరు అందించారు. వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ ద్వారా ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీరు అందించారు. అలాగే పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాటుచేశారు. దీంతోపాటు లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరో 5,100 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందింది కూడా వైఎస్సార్ పాలనలోనే అనేది జగమేరిగిన సత్యం. అందుకే ఇక్కడి ప్రజలు అయనను అనుదినం స్మరించుకుంటున్నారు.
రైతు బాంధవుడు
తుగ్గలి: వరుస కరువులతో 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులవి. భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణమాఫీ చేయడంతో పాటు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కానీ రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితి తెచ్చారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండటం ఆయన చలువే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి, పందికోన వద్ద రిజర్వాయర్లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారు.


