ఆదోని అర్బన్: పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి కింద మెయిన్ బ్రాంచి పోస్టాఫీసు సమీపంలో పంప్‌హౌస్ దుకాణంలో చోరీ జరిగింది. పంప్‌హౌస్ దుకాణదారుడు నిజాం తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి పైకప్పులో కన్నం వేసి దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగలను అపహరించారు. బుధవారం ఉదయం దుకాణం తలుపులు తీయగా పైకప్పులో కన్నం ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకున్నారు. దుకాణాన్ని పరిశీలించగా దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగల సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యువతి అదృశ్యం
కొత్తపల్లి: శివపురం చెంచుగూడెంకు చెందిన ఓ యు వతి మూడు రోజులుగా కనిపించడం లేదు. గూడెంకు చెందిన ఐలేని కోటయ్య రెండవ కూతురైన ఐలేని ఇందు (17) గత నెల 30వ తేదీన రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి కుటుంబీకులు బుధవారం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జయశేఖర్ తెలిపారు.
మొక్కజొన్న పంటపై పందుల దాడి
గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.


