కృష్ణగిరి: మండలంలోని పెద్దొడి గ్రామంలో ఆంజనేయస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం న్యూ కేటగిరి వృషభాలకు నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలలో కృష్ణా జిల్లా యనమలకుడూరు ఆజాద్ వృషభాలు విజేతలుగా నిలిచి రూ.40 వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో తర్వాతి నాలుగు స్థానాలలో వరుసగా అనంతపురం కేసీపల్లె మీసాల కిరణ్ వృషభాలు, నంద్యాల సాంబవరం జూపల్లె ప్రభాకర రెడ్డి వృషభాలు, గద్వాల గొర్లకానిదొడ్డి కురువ కర్రప్ప వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లాల పురం కొలిమి పద్మావతి ఎడ్లు నిలిచి వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. విజేత వృషభ యజమానులకు నిర్వాహకులు, దాతలు బహుమతులిచ్చారు.
సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
అనంతపురం సెంట్రల్: కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీఐ తబ్రేజ్ అహ్మద్ కారు తరచూ ప్రమాదానికి గురవుతోంది. వారం రోజుల క్రితం అనంతపురం తపోవనం సర్కిల్‌లో సీఐ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద రెడీ టూ కాంక్రీట్ మిక్చర్ లారీ ఢీ కొట్టింది. కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.


