శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో టీడీపీ ముఖ్య నేత అనుచరుడి దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’ కథనంపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది. టీడీపీ ముఖ్య నేత అనుచరుడి పేరు, పార్టీలో తనకు ఉన్న పదవి, ముఖ్య నేత అప్పగించిన బాధ్యతలు ఏంటి.. అని ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన దేవస్థానంలో అధికారులను బెదిరించి తన కార్యకర్తలకు ఇప్పించిన ఉద్యోగాలు, ఏజెన్సీలు, ఇంజినీరింగ్ టెండర్లు, తలనీలాలు టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై తన కార్యకర్తలతో చేయించిన దాడి గురించిన పలు విషయాలను ఇంటలిజెనన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తలనీలాల కాంట్రాక్టర్లను రింగ్ చేసి కమిషన్ దండుకున్న విషయాలను సైతం రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నేత అనుచరుడు దేవస్థానంలో చేస్తున్న దందాపై ఇంటెలిజెన్స్ అధికారులు ఒక నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు పార్టీ అధిష్టానానికి సైతం పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


