విద్యుత్‌ తీగల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల దొంగ అరెస్ట్‌

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

సి.బెళగల్‌: పొలాల్లో వ్యవసాయ విద్యుత్‌ బోరు మోటార్లు, తీగలను అపహరిస్తున్న దొంగను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో దొంగను అరెస్‌ చూపుతూ, కేసు వివరాలను వెల్లడించారు. సి.బెళగల్‌, గూడూరు మండలాల్లో రైతుల వ్యవసాయ విద్యుత్‌ బోరు మోటర్లు, తీగలు చోరీకి గురైనట్లు పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు చేపట్టగా.. గుండ్రేవుల గ్రామానికి చెందిన పాలాక్షి రెడ్డి నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సి.బెళగల్‌ మోడల్‌ స్కూల్‌ దగ్గర అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ పంపారు. నిందితుడి నుంచి దాదాపు రూ.1.30 లక్షల విలువ చేసే 600 మీటర్ల కాపర్‌ వైరు, మూడు విద్యుత్‌ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుళ్లు ప్రసాద్‌, తిమ్మప్ప, క్రిష్ణగౌడ్‌, కానిస్టేబుళ్లు సత్యరాజు, శ్రీని వాసులు, సుధాకర్‌, జానకిరాముడును ఎస్‌ఐ అభినందించారు.

గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ

82 గొర్రెలు మృత్యువాత

తుగ్గలి: గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 82 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గిరిగెట్ల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గిరిగెట్ల గ్రామానికి చెందిన గొర్ల పక్కీరప్ప గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పక్కీరప్ప కుమారులు గొర్రెలు మేపుకుంటూ సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక డాబా వద్ద ఆదోని నుంచి గుత్తికి పశువులు తీసుకెళుతున్న ఆల్విన్‌ లారీ బ్రేక్‌ ఫెయిల్‌ అయి ప్రమాదవ శాత్తూ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 166 గొర్రెల్లో 82 మృత్యువాత పడగా..మరో 25కు పైగా తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధిత కాపరి వాపోయాడు. ప్రమాదస్థలాన్ని తుగ్గలి, జొన్నగిరి ఎస్‌ఐలు నరేష్‌, మల్లికార్జున పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్‌ఐ తెలిపారు.

వాల్మీకి నగర్‌లో పోలీసుల సోదాలు

ఆదోని: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్‌ ప్రాంతంలో డీఎస్‌పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆదోని వన్‌ టౌన్‌ సీఐ వెంకటరమణ, టూ టౌన్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డితో పాటు టూ టౌన్‌, త్రీ టౌన్‌, తాలూకా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు, 25 మంది పోలీసులు వాల్మీకి నగర్‌ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని రౌడీషీటర్లు, అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో శేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో 10 లీటర్ల నాటు సారా లభించడంతో పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. శేఖర్‌పై ఆదోని వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే విధంగా వాల్మీకి నగర్‌ ప్రాంతంలో సుమారు 25 మోటార్‌ సైకిళ్లకు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేని వాటిపై జరిమానాలు విధించారు.

కురువళ్లి చెరువు

నిండేదెన్నడూ!

ఆలూరు రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఒట్టిపోయాయి. నిండుకుండల్లా ఉండాల్సిన చెరువులు నేడు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. ఆలూరు మండలంలోని కురువళ్లి గ్రామ చెరువు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3 వందల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ చెరువు కింద రైతులు వరి, పత్తి తదితరులు పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులో చుక్కనీరు చేరలేదు. దీంతో బోర్ల ఎండిపోయాయని, చెరువు కింద పంట సాగు చేయకుండా పొలాలను బీడుగా వదిలేశామని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement