ఎమ్మిగనూరుటౌన్: తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఎల్లెల్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ నియోజవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బీఆర్ బసిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణం నుంచి ఎల్లెల్సీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వరినారుతో బైఠాయించి సాగునీరు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఏఈ మణికంఠకు అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రబీ సీజన్‌లో తుంగభద్ర గేట్ల మరమ్మతుల పేరుతో నీరివ్వకుండా అడ్డుకోవడంతో పంటలను కోల్పోయామన్నారు. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. చాలా మంది రైతులు నారుమళ్లు పోసి నీటి విడుదల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆయకట్టు ఎండుతున్నా పట్టించుకోరా?
రైతులను విస్మరిస్తే
ఆందోళనలు ఉద్ధృతం
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి
రైతులతో కలసి
ఎల్లెల్సీ కార్యాలయం ముట్టడి
డ్యామ్‌లో నీరున్నా ఎందుకు ఇవ్వడం లేదు..
తుంగభద్ర డ్యామ్‌లో నీటి కోటా ఉన్నా ఖరీఫ్ సాగుకు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఎల్లెల్సీ రైతుల బాధలు పట్టవా అని ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంపీపీ కేశన్న, సోగనూరు భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, బుట్టారంగయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మల్లికార్జున రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూర్, మాచాని వెంకటేష్, కోటేకల్ లక్ష్మన్న, రంగస్వామి, సునీల్ కుమార్, సావిత్రమ్మ, భాస్కర్, రాముడు నియోజకవర్గంలోని రైతులు పాల్గొన్నారు.


