ఆస్పరి: ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రానికి వెళ్లే మలుపు దగ్గర శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆస్పరి సీఐ శ్రీనివాస్‌నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామతీర్థం క్షేత్రంలో వెలసిన గాయత్రీ మాత ఆలయంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజకు పత్తికొండ మండలం దేవనబండ గ్రామానికి చెందిన దామోదరమ్మ (75) వచ్చింది. పూజ ముగిసిన తరువాత స్వగ్రామానికి వెళ్లేందుకు మలుపు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.


