అధికారుల ముందే ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అధికారుల ముందే ఆత్మహత్యాయత్నం

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్‌ ఖాన్‌ను పరామర్శించిన కాటసాని

కల్లూరు/ఓర్వకల్లు: తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక అధికారుల ముందే చిన్న హజామ్‌ ఖాన్‌ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఈయనకు సర్వే నంబర్‌ 339లో 2.50 ఎకరాల భూమిని కొన్నేళ్ల నుంచి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ భూమిలో 45 సెంట్లు ఆక్రమించుకున్నాడని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. అంతేగాక ఆ భూమికి కొలతలు వేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మండల సర్యేయర్‌, గ్రామ సర్వేయర్లు కొలతలు వేసేందుకు పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడే అధికారులకు, అజామ్‌ ఖాన్‌ మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అధికారుల ముందే అజామ్‌ఖాన్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా విధులకు ఆటంకం కల్గించిన అజామ్‌ ఖాన్‌పై అధికారుల బృందం ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రజలను వేధిస్తున్నారు

టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి సామాన్య ప్రజలను వేధిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్‌ ఖాన్‌ను పరామర్శించి, బాధితుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అరకొర భూమితో జీవనం సాగిస్తున్న చిన్న హజామ్‌ ఖాన్‌కు రెవెన్యూ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. అతనికి ఏదైనా జరిగితే ఓర్వకల్లు తహసీల్దార్‌, సంబంధిత సర్వే అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పనిచేయాలని, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement