● కర్నూలులో జూనియర్ వైద్యుల
బైక్ ర్యాలీ
కర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంపునకు జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. బుధవారం కూడా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ ఓపీ, ఐపీ సేవలతో పాటు అత్యవసర, ఐసీయూ వైద్యసేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. 10వ రోజుకు చేరుకున్న ఆందోళన ఫలితంగా ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం కంటే బుధవారం ఓపీ సంఖ్య మరింత తగ్గి 1500 లోపే నమోదైంది. ఇన్‌పేషెంట్ల సంఖ్య సైతం 500 పైగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు అత్యవసరం, సీరియస్‌గా ఉన్న రోగులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వార్డుల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని సైతం కాస్త కోలుకుంటే సమ్మె ముగిశాక రావాలని సూచించి డిశ్చార్జ్ చేస్తున్నారు. కాగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి నుంచి కొండారెడ్డి బురుజు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వైద్యలందరం రోడ్లపైకి వచ్చి మా ఆవేదనను శాంతియుతంగా వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.


