కోడుమూరు రూరల్: కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం నత్తలతో పోటీ పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రూ.20 కోట్లతో ఎంతో ఆర్భాటంగా కోడుమూరు నుంచి వెల్దుర్తికి రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర కిందట చేపట్టింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే కోడుమూరు నుంచి వెల్దుర్తి, డోన్‌కు వెళ్లే వాహనదారులతో పాటు, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, అమడగుంట్ల వంటి సుమారు 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ఐదారు నెలల్లో పూర్తి చేయాల్సిన రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర గడిచినా 50 శాతం మేర కూడా ప్రభుత్వం పూర్తి చేయించలేకపోయింది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ కోడుమూరు నుంచి వెంకటగిరి వరకు రోడ్డుకిరువైపులా కంకర, గ్రావెల్ పరిచి వదిలేయగా, వెంకటగిరి నుంచి గోరంట్ల మధ్య కంకర పరిచి వదిలేయడంతో వాహనదారులంతా చిల్లబండ క్రాస్ రోడ్డు మీదుగా గోరంట్లకు చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి తమ ఇబ్బందులను తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఏడాదిన్నరగా సాగుతున్న
కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం
ఇబ్బందులు పడుతున్న
వాహనదారులు


