బొలెరో బోల్తా.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

బొలెరో బోల్తా.. ఒకరి మృతి

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

బస్సు ఢీకొని పీడీ దుర్మరణం

13 మందికి గాయాలు

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం దిగువ భాగంలోని మలుపు వద్ద బుధవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సోముల నాయక్‌ (60) చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. 60 ఏళ్ల వయసున్న బిక్యా నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అచ్చంపేట తాలూకా బుడ్డా తండాకు చెందిన 14 మంది మత్స్యకారులు కూలి పనులకు దోర్నాల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అచ్చంపేటకు వెళుతుండగా డ్యాం వద్ద ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం డ్యాం సమీపంలోని మలుపు వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేశారు.

జీవాలకు మేతగా

మొక్కజొన్న పంట

చాగలమర్రి: ఎన్నో ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేయగా సరిగా మొలవకపోడం, పైరు ఎదుగుదల లేక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కౌలు రైతు బాధను దిగమింగుకొని జీవాలకు మేతగా వదిలేశాడు. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన దాదనగాళ్ల చాంద్‌ బాషా రూ.40 వేలు చెల్లించి రెండెకరాల పొలంను కౌలుకు తీసుకొని రూ.70 వేలు ఖర్చు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే వాతావరణ మార్పుల వల్లనో, నకిలీ విత్తనాల వల్లనో పంట సరిగ్గా మొలవలేదు. అలాగే పైరు ఎదుగుదల లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధను దిగమింగుకొని బుధవారం పంటను తొలగించే క్రమంలో మొక్కజొన్న పైరులో జీవాలను మేపడానికి వదిలేశాడు. నష్టాన్ని పూడ్చుకోవటానికి రెండెకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కౌలు రైతు చాంద్‌బాషా తెలిపారు. పంట నష్టపోయిన తనను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.

విద్యార్థికి తీవ్ర గాయాలు

గుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్‌ అనే ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల పట్టణంలోని శ్యాం నగర్‌కు చెందిన మనోజ్‌ (26) గుత్తి మండలం సేవాఘడ్‌ పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత ఆరో తరగతి విద్యార్థి రిషిద్‌తో కలిసి బైక్‌లో గుత్తికి బయలుదేరారు. మార్గం మధ్యలో చెరువు కట్ట వద్ద గుంతకల్లు డిపో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన పీడీ మనోజ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి రిషిద్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మనో జ్‌ పీడీగా ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ శోకసంద్రంలో నెట్టింది. ఘటనపై సీఐ రామారావు విచారణ చేపట్టారు.

ట్రాక్టర్‌ బోల్తా.. యువకుడి మృతి

బనగానపల్లె రూరల్‌: పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి హైదర్‌ సాహెబ్‌గారి ఆరీఫ్‌ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెరువుపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద అబ్బాస్‌ కుమారుడు ఆరీఫ్‌ గ్రామ సమీపంలోని తమ సొంత పొలంలో పనుల నిమిత్తం ట్రాక్టర్‌ నడుపుకుంటూ వెళ్లాడు. దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్‌ చేస్తున్న ఆరీఫ్‌ కిందపడిపోగా.. ట్రాక్టర్‌ అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement