కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి
ఉయ్యాలవాడ: కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని అల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నక్క చిన్న బాలగురప్పకు 50 గొర్రెలు ఉన్నాయి. వాటిని ప్రతి రోజు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం రాత్రి వాటిని గ్రామశివారులో ఉన్న రేకుల షెడ్‌లో రోజులాగానే ఉంచారు. బుధవారం ఉదయం షెడ్ దగ్గరికి వెళ్లి చూస్తే 20 గొర్రెలు మృత్యువాత పడి ఉన్నాయి. కుక్కల దాడితో జరిగిన ఈ ఘటన వల్ల సుమారు రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని ఉయ్యాలవాడ తహసీల్దార్ ప్రసాద్‌బాబును కలిసి విన్నవించారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె.గురవయ్య ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులకు పీఎం సూర్యఘర్ స్కీం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించుకునే దిశగా అవగాహన కల్పించాలన్నారు. లో ఓల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని, ఓవర్ లోడ్ ఉంటే 11 కేవీ ఫీడర్లను విభజించి అదనపు ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేశ్వరరెడ్డి, శేషాద్రి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్నరాఘవులు, టౌన్ డీఈలు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని అదృశ్యం
బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైందని తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపారు. విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో విచారించినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి


