మెడికల్ కౌన్సిల్ మెంబర్‌గా శ్రీహరి ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్) ఎన్నికల్లో సభ్యుడిగా కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 84 మంది నమోదిత వైద్యులు అభ్యర్థులుగా పోటీ చేయగా, ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు ఆన్‌లైన్ విధానంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి కేవీఎన్. చక్రధర్‌బాబు మంగళవారం ప్రకటించారు. హెచ్‌ఆర్‌డీఏ ప్యానెల్ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 9 మంది ఘన విజయం సాధించారు. అందులో కర్నూలు జిల్లా వాసి డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య మండలిని బలోపేతం చేయడానికి, వైద్యుల గౌరవం, స్వాభిమానాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు.


