ఫూలే విగ్రహంపై దాడి దారుణం
కర్నూలు(అర్బన్): తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై దాడి దారుణమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలులోని ఫూలే సర్కిల్‌లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మి, ఖధీరుల్లా, కేవీపీఎస్ ఆంనద్‌బాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఫూలే విగ్రహాన్ని కూలగొడుతూ కాళ్లతో తన్ని బహుజనుల మనోభావాలను కించపర్చారన్నారు. ఫూలే చరిత్ర తెలుసుకోకుండా ఆయన విగ్రహంపై దాడి చేయడం సిగ్గుచేట్టాన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, మనువాదులపై చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతినిధి జయన్న, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు చిరంజీవి, పెరికల రంగస్వామి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, కంది వరుణ్ కుమార్, సత్యనారాయణ, బీఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మహిళా ఐక్యవేదిక నాయకులు ఈరమ్మ, పెద్దక్క, అమీనాబీ, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.


