వ్యర్థాల నిర్వహణతోనే పర్యావరణ పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియల అంశాలపై కలెక్టర్ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మునిసిపాలిటీల్లో రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, వాటిలో ఎన్ని టన్నులు పొడి, ఎన్ని టన్నులు తడి చెత్తలుగా వస్తాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తడి చెత్తను విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు, పేపర్ వంటి వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వేలో పురోగతికి చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మిగనూరు, ఆదోని మునిసిపల్ కమిషనర్లు గంగిరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.


