రైస్‌మిల్‌లో కొండ చిలువలు
బండిఆత్మకూరు: మండల కేంద్రంలోని ఓ పాత రైస్ మిల్‌లో శనివారం అటవీ అధికారులు రెండు కొండ చిలువలను పట్టుకున్నారు. శనివారం ఉదయం రైస్‌మిల్ వైపు వెళ్లిన స్థానికులకు రెండు కొండ చిలువలను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు లింగాపురం ఎఫ్‌బీఓ హైమావతితో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక పరికరాలతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఒక కొండ చిలువ ఏడు అడుగులు, ఇంకొకటి ఆరు అడుగుల పొడవు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు.
గుండెపోటుతో అసిస్టెంట్ లైన్‌మన్ మృతి
గడివేముల: తిరుపాడు గ్రామంలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న వెంకటరమణ (46) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఈ మేరకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గడివేముల ఏఈ ఖలీల్ పాషా, డిప్యూటీ ఎక్యూటివ్ ఇంజినీర్ సుబ్రమణ్యం, లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీమన్నారాయణ, కాంట్రాక్టర్ శేషాద్రిగౌడ్, సిబ్బంది శివ, రవి, నరేంద్ర, మండల సిబ్బది, తదితరులు నివాళులర్పించారు.
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
వెల్దుర్తి: చెరుకులపాడు గ్రామంలో మతి స్థిమితం లేని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రంగడు, రాములమ్మ దంపతులు ఇంట్లోనే కిరాణషాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. వెల్దుర్తికి చెందిన బంధువైన ఓ వృద్ధురాలు శుక్రవారం బ్రహ్మంగుండం కోనేరులో పడి మరణించింది. వృద్ధురాలి అంత్యక్రియలకు రాములమ్మ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. రాములమ్మకు మూడు నెలలుగా చావు కబురు విన్నా, ఇతరత్రా సందర్భాల్లో మతి స్థిమితం కోల్పోయేది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న రాములమ్మ తమ కిరాణ దుకాణంలో విక్రయానికి ఉంచిన పెట్రోల్ తీసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
బంగారు దుకాణంలో భారీ చోరీ
● రూ. 40 లక్షల ఆభరణాలు అపహరణ
బనగానపల్లె: పట్టణంలోని రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయానికి అతి సమీపంలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. స్థానిక శ్రీని వాస జ్యువెలర్స్ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ చోరీలో 18 తులాల బంగారు ఆభరణాలు, ఐదు కేజీల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ విషయం వెలుగు చూడటంతో ముందుగా ట్రైనీ డీఎస్పీ రాజసింహ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. గ్యాస్ కట్టర్‌తో షట్టర్ తాళాలను తొలగించినట్లు గుర్తించారు. నంద్యాల నుంచి ఫింగర్ ప్రింట్స్ అధికారులు దుకాణాన్ని పరిశీలించి నిందితుల వేలిముద్రలు సేకరించారు. సాయంత్రం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు దుకాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. చోరీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు.
నిందితుడి అరెస్టు
కర్నూలు: కర్నూలు శివారు బాలాజీ నగర్‌లో నివాసముంటున్న ఎన్.దేవరాజు (70) హత్య కేసులో నిందితుడు ఎద్దుల రవికుమార్‌ను తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మృతుడు దేవరాజు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో స్వీపర్‌గా పనిచేసి 2011లో ఉద్యోగ విరమణ పొందాడు. ఇతనికి ఐదుగురు సంతానం ఉన్నారు. నాలుగో కుమారుడైన రవికుమార్ ఈనెల 5వ తేదీ డబ్బుల కోసం తండ్రితో గొడవ పడి బలంగా నెట్టడంతో తీవ్ర గాయాలతో దేవరాజు మృతిచెందాడు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ వల్లనే గాయాలకు గురై దేవరాజు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం సాయంత్రం తాండ్రపాడు గ్రామ శివారులోని రింగ్ రోడ్డు బ్రిడ్జి కింద (సఫా కళాశాల వద్ద) అరెస్టు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజోమూర్తి తెలిపారు.
రైస్‌మిల్‌లో కొండ చిలువలు
రైస్‌మిల్‌లో కొండ చిలువలు


