కోనేటి రాయుడికి కిరణాభిషేకం
ఉయ్యాలవాడ: ఇంజేడు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోనేటి రాయుడిని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. స్వామి వారికి ప్రీతికరమైన రోజైన శనివారం రోజున సూర్య కిరణాలు ఆలయంలోకి చేరి స్వామి వారిని తాకడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తులు స్వామి వారితో పాటు సూర్య భగవానునికి నమస్కరించుకున్నారు. అలాగే మండల పరిధిలోని ఆర్.జంబులదిన్నె, ఉయ్యాలవాడ, సుద్దమల్ల గ్రామాలలో వెలిసిన అభయాంజనేయస్వామి, శ్రీ లక్ష్మి నరసింహ కంబగిరి స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు అనంతయ్య, లక్ష్మణస్వామి, భాస్కరశర్మ, కమలేష్‌శర్మలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


