శివయ్యా.. వచ్చేస్తున్నాం!
ఆత్మకూరు: శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమల మీదుగా భక్తుల అడుగులు శ్రీశైలం వైపు పడుతున్నాయి. ఏటా శివరాత్రికి 20 రోజులు ముందుగానే భక్తులు పాదయాత్రగా కదిలేవారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించేవారు. కొందరు సుదూర ప్రాంతాల ఉంచే పాదయాత్రగానే శ్రీశైలం చేరుకునే వారు. అయితే ఈ ఏడాది నల్లమలలో పులుల గణన కారణంగా భక్తుల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈనెల 8వ తేదీ నుంచి మాత్రమే అనుమతి ఇస్తామని అటవీ అధికారులు ప్రకటించారు. అయితే పులుల గణన యుద్ధప్రాతికన పూర్తి చేసి రెండు రోజుల ముందుగానే శుక్రవారం నుంచి భక్తుల పాదయాత్రకు ఫారెస్టు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో పాదయాత్ర భక్తులు వెంకటాపురం నుంచి బయలుదేరారు. నాగలూటి, పెచ్చెరువు, దామర్లకుంట, సీతమ్మభావి, కత్తులకొండ భీమునికొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుని అక్కడి నుంచి హఠకేశ్వరం మీదుగా సాక్షి గణపతి చేరి మొక్కులు చెల్లించి అనంతరం శ్రీశైల మల్లన్న ను దర్శించుకుంటారు. తొలిరోజు దాదాపు 1000 మందికి పైగా భక్తులు శ్రీశైలం వైపు పాదయాత్రగా కదిలారు. ఈనెల 15వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇల కైలాసమైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు తరలిరానున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులను వెంకటాపురం వద్ద అటవీ అధికారులు తనిఖీ చేసి పంపుతున్నారు. నిప్పు పెట్టే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రిని అనుమతించడం లేదు.
కాలినడకన శ్రీశైలయానికి అటవీమార్గంలో వెళ్లే భక్తులు అటవీశాఖ నిబంధనలను పాటించి సహ కరించాలి. ప్రతి భక్తుడి బ్యాగులు పరిశీలించి సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టె, గుట్కా తదితర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్రధానంగా అటవీ మార్గంలో వెళ్లే పాదయాత్ర చేసే భక్తులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించరాదు. అరణ్యంలోకి ప్లాస్టిక్‌ను తీసుకెళ్లడం, అడవికి నిప్పు పెట్టే అగ్నిపెట్టెలు, మద్యం తదితర వాటిని నిషేధించాం. రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే సమయంలో శబ్దం చేయరాదు.
– జాకీర్‌హుసేన్, ఫారెస్టు డీఆర్వో
నల్లమల మీదుగా
భక్తుల పాదయాత్ర ప్రారంభం
పులుల గణన నేపథ్యంలో
ఆలస్యంగా అనుమతి
ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
శివయ్యా.. వచ్చేస్తున్నాం!


