నీటి కోసం సచివాలయం ముట్టడి
ఆలూరు: హత్తిబెళగళ్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని అధికారులు పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం ఆలూరు గ్రామ రోడ్డు సమీపంలో సచివాలయం వద్దకు పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడిని పరిష్కరించేంత వరకు ఉద్యోగులను బయటకు వెళ్లనీయమని భీష్మించారు. అనంతరం వారు ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, తదితరులకు సమాచారాన్ని చేరవేశారు. సంబంధిత అధికారులు సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన విధుల్లో ఉన్నామని, వచ్చిన తర్వాతనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే ‘వారు వచ్చే వరకు మా గొంతులు ఎండిపోవాలనా... ఇప్పటికే 20 రోజులుగా నీళ్లు లేక విలవిలాడుతున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.
నీ ప్రేమ బంగారం కాను..!
కొందరు పశుపోషకులు మూగజీవాల పట్ల చూపించే ప్రేమను వెలకట్టలేనిది. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే వృషభాలను యజమానులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్దికెరలో మద్దమాంబ తిరుణాల సందర్భంగా రాతి దూలం పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు వచ్చాయి. యాడికి చెందిన వీరశేఖర్ అనే వ్యక్తి వృషభాలకు దోమలు కుట్టకుండా దోమతెరలను కట్టారు. రైతు జాగ్రత్తలు చూసి స్థానికులు అభినందించారు. – మద్దికెర
నీటి కోసం సచివాలయం ముట్టడి


