కోడుమూరు రూరల్: శివరాత్రి సందర్భంగా మాల ధరించి ఇరుముడితో శ్రీశైలానికి పాద యాత్రగా బయలుదేరిన ఓ శివస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోడుమూరు– కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు చెందిన వీరేష్ (35) శివ మాల ధరించి శుక్రవారం ఉదయం శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. మార్గమధ్యలో కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి సమీపంలో రహదా రిపై నడుచుకుంటూ వెళుతుండగా, కోడుమూరు నుంచి కర్నూలు వైపు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ పాదయాత్ర భక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరేష్‌కు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న వీరేంద్ర అనే యువకుడికి, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరేష్ కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాదంపై కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ. వందతో ఏమార్చి
రూ. 2.60 లక్షలు అపహరణ
నందికొట్కూరు: బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసుకుని వెళ్తున్న ఓ వృద్ధుడిని గుర్తు తెలియని దుండగులు ఏమార్చి రూ. 2.60 లక్షలు అపహరించారు. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి పెద్ద పుల్లారెడ్డి శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో రూ. 2.60 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి బైక్‌పై బయల్దేరాడు. వృద్ధుడి బైక్‌ను వెంబడించిన ఇద్దరు యువకులు మార్గమధ్యలో రోడ్డుపై రూ.వంద నోటు వేసి.. ‘పెద్ద య్య నీ డబ్బులు కిందపడ్డాయి’ అని చెప్పారు. పుల్లారెడ్డి బైక్ నిలిపి వంద నోటు తెచ్చుకునేందుకు వెళ్లగా.. బైక్‌పై ఉన్న రూ.2.60 లక్షల నగదుతో ఇద్దరు యువకులు పరారయ్యారు. బాధితుడు మిడుతూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఓబులేసు తెలిపారు.
జగనన్న కాలనీలో గ్రావెల్ తవ్వకం
కల్లూరు: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తడకనపల్లెలో 86వ సర్వే నంబర్‌లో లే ఔట్ వేసింది. జగనన్న కాలనీ లో కొందరు దుండగులు ప్లాట్లను చదును చేస్తూ ఎర్ర మట్టి తవ్వుతున్నారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


