వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
● వైఎస్సార్‌సీపీ రజక విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య
కర్నూలు(అర్బన్): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పన్నీటి కాశయ్య అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ రజక ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్.. వైఎస్సార్‌సీపీ రజక విభాగాన్ని ఏర్పాటు చేసి తనను అధ్యక్షులుగా నియమించారన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రజక నేతలను కలుస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పా రు. ఇప్పటి వరకు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని, ఆయా జిల్లాల్లోని రజకులు, బీసీల్లో వైఎస్ జగన్ పట్ల ఎనలేని అభిమానం, ప్రేమ చెక్కు చెదరలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష, బలమైన పట్టుదల ఉన్న వారిని గుర్తించి వైఎస్సార్‌సీపీ రజక విభాగంలో జిల్లా, నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో రజకులతో పాటు మిగిలిన బీసీ కులాలప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. 2024 ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల రజక జనాభా ఉందన్నారు. రజకుల ఓట్లతోనే ముఖ్యమంత్రిగా జగన్‌ను చూడాలనే బలమైన ఆశయంతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భారతీ, స్థానిక వైఎస్సార్‌సీపీ రజక నేతలు బలరామ్, గోల్డ్‌మెన్ శ్రీనివాసులు, బబ్లూ, బాబ్జీ, వెంకటేష్, సింగారం రంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి కర్నూలుకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్యను స్థానిక నేతలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.


