వీబీఆర్ పరిసరాల్లో చిరుత సంచారం
● భయం గుప్పిట్లో స్థానికులు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్) పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన వీబీఆర్ సమీపంలో ఓ చిరుత సంచ రిస్తూ నెమలిపై దాడి చేసిన దశ్యాలను అక్కడున్న ఓ మత్స్యకారుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ పరిసరాల్లో వ్యవసాయ పనులు నిర్వహించే రైతులు, అలాగే రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వచ్చే యాత్రికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అడవి జంతువుల సంచారం పెరుగుతోందని, రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు, వెలుగోడు ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటంతో అప్పుడప్పుడు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అడవి జంతువులు సంచరించడం సహజమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరా ల్లో మత్స్యకారులు, రైతులు గుంపులుగా వెళ్లాలని, వన్యప్రాణులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు.


