18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు
కర్నూలు సిటీ: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్‌లో 223 మంది, హైయర్‌లో 85 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి ఎస్‌ఏపీ క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో ఈ నెల 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయన్నారు. టైలరింగ్ లోయర్ పరీక్షకు 141 మంది, హైయర్ పరీక్షకు 60 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షకు ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ నెల 18, 19 తేదీల్లో పరీక్ష జరుగనుందన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ తెలిపారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి
ఆళ్లగడ్డ: వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. తొమ్మండ్రు వీధికి చెందిన దస్తానంద, రజియా దంపతుల కుమారుడు ఆరేళ్ల దివికేశ్ ఇంటి ముంద సైకిల్‌తో ఆడుతుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కుక్కల దాడి నుంచి బాలుడిని రక్షించారు. ఈ దాడిలో బాలుడి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలున్ని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు.


