9న అప్రెంటిస్ మేళా
కర్నూలు సిటీ: ఏపీ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని బి.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ(బాలికలు)కాలేజీలో మేళా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు మేళాలో పాల్గొంటారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఆన్‌లైన్‌లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ httpr:/apprenticerhipindia.gov.in అనే పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మేళాకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
డీఆర్‌సీ ఏడీఏ వెంకటేశ్వర్లు బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖకు సంబంధించిన జిల్లా వనరుల కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన ఇక్కడ రిలీవ్ కానున్నట్లు సమాచారం.
ఖజానా శాఖలో ఇద్దరికి పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ శాఖలో ఇద్దరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఖజాన శాఖ డైరెక్టర్ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్‌టీఓగా పనిచేస్తున్న విజయమ్మకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరుగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేశారు. గూడూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న భాగ్యమ్మకు ఎస్‌టీఓగా పదోన్నతి లభించింది. ఈమె ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ అధికారిగా బదిలీ అయ్యారు.
కర్నూలు సబ్ ట్రెజరీ ఎస్టీఓగా
శ్రీనివాసరాజు
కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ అధికారిగా శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఇక్కడ ఎస్‌టీఓగా పనిచేస్తున్న విక్రాంత్ జనవరి 31న పదవీ విరమణ పొందారు. ఈ పోస్టులో శ్రీనివాసరాజును నియమించారు. గతంలో శ్రీశైలం ఎస్‌టీఓగా పనిచేసిన ఆయన ఆరు నెలలుగా సెలవుల్లో ఉన్నారు.
పంటల నమోదు 52 శాతమే
కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ పంటల నమోదు సుదీర్ఘంగా సాగుతోంది. రబీ సీజన్‌లో సాగు చేసిన శనగ, జొన్న, వాము తదితర పంటల కోతలు ముగింపు దశకు చేరుకున్నాయి. పంటల నమోదు మాత్రం 50 శాతం కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 8,32,213 సర్వే నెంబర్లకు సంబంధించి 13,46,416 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి సర్వే నెంబర్‌కు వెళ్లి పంట ఉన్నా.. లేకపోయినా నమోదు చేయాల్సి ఉంది. హాలహర్వి, కౌతాలం, ఆలూరు, ఓర్వకల్ మండలాలు రబీ పంటల నమోదులో పూర్తిగా వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు 3,62,774 సర్వే నెంబర్లను నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 6,14,760 ఎకరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. రబీ సీజన్ ముగింపు దశకు చేరినప్పటికీ 52 శాతం వరకే మాత్రమే పంటల నమోదు పూర్తయింది.
తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలోని పరిమళ తీర్థ పుష్కరిణిలో గురువారం రాత్రి ప్రహ్లాదరాయలు తెప్పోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ మఠం మూల బృందవనం నుంచి పల్లకీలో ప్రహ్లాదరాయలు ఉత్సమూర్తిని ఊరేగింపుగా పరిమళ తీర్థ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేపట్టిన తెప్పోత్సవాన్ని తిలకేంచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. పరిమళ పుష్కరిణి మండపంలో ముందుగా పూలతో పుష్పార్చన, అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు మహా మంగళ హారతులు చేపట్టి భక్తులు హారతి ని దర్శించుకున్నారు. అనంతరం పుష్కరిణిలో మండపం చుట్టూ ప్రహ్లాదరాయలు తెప్పోత్సవంలో విహరిస్తూ భక్తులను పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు.


