వేపచెట్లకూ కష్టమొచ్చింది!
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు అన్ని రకాల పంటలకు సోకే చీడపీడలు, పురుగుల నివారణకు వేప ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. సహజంగా వేప చెట్లకు చీడపీడలు, పురుగుల బెడద ఉండదు. ప్రతి రోజు నాలుగైదు లేత వేపాకులు తినడంతో ఆరోగ్యం కాపాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అపర సంజీవనిగా చెప్పుకునే వేప చెట్లకూ కష్టం వచ్చింది. ఎవరో కాల్చేసినట్లుగా చెట్లు ఎండిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. టి మస్కిటో బగ్ అనే పురుగు వేపచెట్లకు హాని కలిగిస్తోంది. ఈ పురుగు 2021, 2022 సంవత్సరాల్లో వేప చెట్లపై విజృంభించింది. అప్పట్లో కూడా చెట్లు ఎండిపోయాయి. అయితే తర్వాతి కాలంలో మళ్లీ కోలుకున్నాయి. ఇప్పుడు కొద్ది నెలలుగా ఇదే పురుగు మళ్లీ దాడిచేస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
టిమస్కిటో బగ్ ప్రభావం మళ్లీ మొదలైంది. ఈ పురుగులు కొమ్మల చివర్లలోని ఆకుల పత్రహరితాన్ని పీల్చేస్తుండటం వల్లే చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇది కొమ్మ ఎండు తెగులు కాదు. ఈ పరిస్థితి రెండు, మూడు నెలలు ఉంటుంది. తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి. పురుగు నివారణకు అసిపేట్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోపాస్ 2 ఎంఎల్ లేదా క్లోరోఫైరిపాస్ 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచాకారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
– సుజాతమ్మ, ఏరువాక కేంద్రం, ప్రధానశాస్త్రవేత్త, కర్నూలు


