రూ.27 కోట్ల మద్యం తాగించేశారు
కొత్త సంవత్సరం వేడుకల పేరిట మద్యం విక్రయాలు ఇలా...
● కొత్త సంవత్సర వేడుకల్లో పొంగిన బీర్లు
● రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
● ‘ముగింపు సేల్’తో
తాగి ఊగిన యువత
● గతేడాది
చివరి రోజు
రూ.9 కోట్ల అమ్మకాలు
కర్నూలు: సంపద సృష్టిస్తా అంటూ గొప్పగా చెప్పే సీఎం చంద్రబాబు తాను సృష్టిస్తున్న సంపద ఏమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. జిల్లాలో మందుబాబులతో ఫుల్‌గా తాగించారు. ఏడాది చివరి మూడు రోజుల్లో ఏకంగా రూ.27 కోట్ల విలువైన మద్యం డిపో నుంచి లిక్కర్ షాపులకు, బార్లకు తరలిపోయి మందుబాబులకు చేరింది. వారం రోజుల్లో అమ్మాల్సిన సరుకు కేవలం మూడు రోజుల్లో విక్రయించారు. ‘సంవత్సరం ముగింపు సేల్’ పేరుతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వారం రోజుల ముందు నుంచే వ్యాపారులను అప్రమత్తం చేసి ‘ఇండెంట్’ మేరకు సరుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. కర్నూలు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపో పరిధిలో సగటున రోజుకు రూ.4 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 29న రూ.8.57 కోట్లు, 30న రూ.8.54 కోట్లు, 31న రూ.9 కోట్లు చొప్పున మొత్తం రూ.27 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
మద్యం వ్యాపారులకు డబ్బే డబ్బు...!
మద్యం వ్యాపారులకు ఈ ఏడాది డబ్బుల పంట పండింది. కొత్త సంవత్సర వేడుకల పేరిట భారీగా విక్రయాలు జరపటానికి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి మద్యాన్ని డిపోలకు, అక్కడినుంచి ప్రైవేటు దుకాణాలకు తరలించారు. జిల్లాలో టీడీపీ నాయకుల కనుసన్నల్లో మద్యం వ్యాపారం సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ఏడాది పొడవునా అడ్డూఅదుపు లేకుండా మద్యం విక్రయాలు సాగించారు. అర్ధరాత్రి వరకు వ్యాపారులు మద్యం విక్రయాలు జరుపుతున్నా ప్రభుత్వ ఉద్దేశం గుర్తించిన పోలీసు, ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు (పట్టించుకోవడం లేదు).
ఎకై ్సజ్ లెక్కల ప్రకారం
ఎకై ్సజ్ శాఖల లెక్కల ప్రకారం గత సంవత్సరం కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఏడాదంతా రూ.1440 కోట్లు మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తరుణంలో మందుబాబులు రెచ్చిపోయారు. పాత ఏడాదికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు మద్యం ప్రియులంతా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్నారు. మామూలు రోజుల్లో ప్రతిరోజూ రూ.4 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక్క రోజు రాత్రే (చివరి రోజు) రూ.9 కోట్ల విలువ చేసే స్టాక్‌ను దుకాణాలు, బార్లలో నిల్వ చేసి మద్యం ప్రియులకు తనివితీరా అందించి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు.
నవోదయం 2.0లో భాగంగా సారా తయారీ, విక్రయాలను పూర్తిగా నిర్మూలించాం. తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాం. నిరంతరం తనిఖీల ద్వారా పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోని రాకుండా కట్టడి చేశాం. ధరలు కూడా పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో మద్యం వినియోగం పెరిగింది.
– ఎం.సుధీర్ బాబు, జిల్లా ఎకై ్సజ్ అధికారి
బీర్లు పొంగాయి... మద్యం పారింది
ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏకంగా బార్ల సమయాన్ని అర్ధరాత్రి వరకు ప్రభుత్వం అనుమతివ్వడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. పర్వదినాల్లో రైతుబజార్లు కొనుగోలుదారులతో కిటకిటలాడినట్లు లిక్కర్ షాపులు కూడా మద్యం ప్రియులతో చివరి రోజు కిక్కిరిసిపోయాయి. జిల్లాలో 110 మద్యం దుకాణాలు, 25 బార్లు ఉన్నాయి. గడచిన ఏడాదికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకున్న వేడుక సాయంత్రం నుంచే ప్రారంభం కావడంతో బీర్లు పొంగాయి, మద్యం ఏరులై పారింది.
తేదీ లిక్కర్ కేసులు బీరు కేసులు విలువ
డిసెంబర్ 29 11,289 4,748 రూ.8.57 కోట్లు
డిసెంబర్ 30 10,962 4,949 రూ.8.54 కోట్లు
డిసెంబర్ 31 11,984 5,461 రూ.9.01 కోట్లు
మొత్తం 34,235 15,158 రూ.26.12 కోట్లు
రూ.27 కోట్ల మద్యం తాగించేశారు


