‘తప్పు’లో కాలేశారు!
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్‌లలో తప్పులు దొర్లడం..అభాసు పాలు కావడం పరిపాటిగా మారింది. సంబంఽధిత అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. తప్పులను సరిద్దిద్దుకునే చర్యలు తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీ విడుదల చేసిన ఫలితాలకు తాజాగా ఇటీవల జారీ చేసిన బీఈడీ నాల్గవ సెమిస్టర్ ప్రొవిజినల్ సర్టిఫికెట్స్‌లో ఉన్న ఎస్‌జీపీఏ, సీజీపీఏ పాయింట్స్ గ్రేడ్‌లలో తేడా ఉన్నాయి. సరి చేయాల్సిన వర్సిటీ సంబంధిత అధికారులు సాంకేతిక సమస్య అని దాటవేస్తున్నారు. ఈ విషయమైన వర్సిటీ సీఈతో బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చర్చించినట్లు తెలిసింది. వారికి సైతం ఆన్‌లైన్‌లో ఫలితాలు ఎలా ఉన్నా.. తాము జారీ చేసిన ప్రొవిజినల్ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోలే సరైనవి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని సర్ది చెప్పి పంపినట్లు తెలిసింది. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించక పోవడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు 3,200 మంది
విద్యార్థులపై ప్రభావం
2023– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను గత ఏడాది డిసెంబర్ 2న విడుదల చేశారు. ఈ సెమిస్టర్‌కు 3,379 మందికి 3,225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,121 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు 142 మందికి 122 మంది పరీక్షలు రాయగా 118 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచే సమయంలో చూసుకోవాల్సిన వర్సిటీ అధికారులు చేసుకోక పోవడంతో ఫలితాల్లో తేడా వచ్చింది. నిబంధనల ప్రకారం సెమిస్టర్ మార్కులకు నాలుగు క్రెడిట్స్ ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి. అయితే రెండు క్రెడిట్స్ ప్రకారం లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ మాత్రం నాలుగు క్రెడిట్స్‌తో పాయింట్లు, సీజీపీఏ కేటాయించారు. కొందరు విద్యార్థులకు మేలు, మరికొందరు విద్యార్థులకు అన్యాయం జరిగినట్‌లైంది. తక్కువ పాయింట్స్ వచ్చిన వారికి మంచి గ్రేడ్ రావడం విస్తుగొలుపుతోంది. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారికి దానికి అనుగుణంగా గ్రేడ్ రాకపోవడం దారుణంగా ఉంది. నాల్గవ సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న ఫలితాల ఆధారంగా సీటెట్, టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఫలితాల్లో పాయింట్స్ తేడా ఉండటంతో కొందరు అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే కాక అదే సంవత్సరానికి సంబంధించి 1, 3 సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్‌లలో సైతం 8 పైగా పాయింట్స్ వచ్చిన విద్యార్థులకు డి గ్రేడ్, ఇ గ్రేడ్ లు రావడం కూడా దురుమారం రేపుతోంది.
వర్సిటీ జారీ చేసిన నాల్గవ సెమిస్టర్ ప్రొవిజినల్ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోల్లో వచ్చిన పాయింట్స్, గ్రేడ్స్‌ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న టెక్నికల్ వెండార్ నాలుగు క్రెడిట్స్ ప్రకారం లెక్కించి ప్రొవిజినల్ సర్టిఫికెట్స్‌ను జారీ చేశారు. తరువాత మార్క్స్ మెమోలను జారీ చేస్తాం. ఆన్‌లైన్‌లో ఉంచిన ఫలితాలు, మార్కులను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వర్సిటీ ఉన్నతాఽధికారుల అనుమతితో ఆన్‌లైన్‌లో ఉన్న ఫలితాలను సైతం సరి చేయిస్తాం.
– డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఆర్‌యూ
ఆర్‌యూ బీఈడీ నాల్గవ సెమిస్టర్
పరీక్షల ఫలితాల్లో గందరగోళం
ఆన్‌ౖలైన్‌లో ఫలితాలు ఒక రకం
ప్రొవిజినల్ సర్టిఫికెట్లలో మరో రకం
సప్లిమెంటరీ ఫలితాల
సర్టిఫికెట్లది మరో తీరు
సీజీపీఏ పాయింట్స్ గ్రేడ్లలోనూ
తికమక
‘తప్పు’లో కాలేశారు!


