నెలాఖరు లోపు వాటర్‌షెడ్ల పనులు ముగించండి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలవుతున్న ప్రధానమంత్రి క్రిషి సంచాయ్ యోజన–2 వాటర్‌షెడ్లను ఈ నెల చివరిలోపు ముగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉండగా 28 మైక్రో వాటర్‌షెడ్లు అమలవుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఐదేళ్లలో రూ.29.97 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.12.03 కోట్ల ప్రకారం మొత్తం రూ.42 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో రూ.20.39 కోట్లు, నంద్యాల జిల్లాలో 8.75 కోట్లు ఖర్చు చేశారు. నిధులను ఈ నెల చివరిలోపు ఖర్చు చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. ప్రస్తుత పనులు క్లోజ్ చేసిన తర్వాత పీఎంకేఎస్‌వై–3 కింద వాటర్‌షెడ్‌లను కేంద్రం మంజూరు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు డ్వామా అదనపు పీడీ మాధవీలత తెలిపారు.
హెడ్ నర్సులకు పదోన్నతి
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమలోని నాల్గవ జోన్‌లో హెడ్ నర్సులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ బి.రామగిడ్డయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వారికి కౌన్సెలింగ్ ద్వారా స్థానాలు కేటాయించి బదిలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న శ్రీగౌరి ఇక్కడికే, తిరుపతిలోని ఎంసీహెచ్‌లో పనిచేస్తున్న వరలక్ష్మి ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రికి, అనంతపురంలో పనిచేస్తున్న గంగామయి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు పదోన్నతిపై బదిలీ అయ్యారు. వీరిని ఆర్‌డీ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాధమ్మ, జిల్లా అధ్యక్షులు లీలావతి, కార్యదర్శి సి.బంగారి, కోశాధికారి ఎన్. లక్ష్మీనరసమ్మ అభినందించారు.
పడిపోయిన మిర్చి ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు దేవనూరు డిలక్స్, ఆర్మూర్, సూపర్–10, బాడిగ, తేజా, మిర్చి–5 రకాలు వస్తున్నాయి. క్వింటాకు కనీసం రూ.20 వేల ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. కర్నూలు మార్కెట్‌లో మిర్చి–5 రకానికి రూ.16,379 ధర లభించింది. తేజా రకానికి రూ.13,689, ఆర్మూర్ రకం రూ.11,901 పలికింది. ఈ ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● మార్కెట్‌కు ఉల్లి రావడం పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారం 38 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.1,298, గరిష్ట ధర రూ.1,459 లభించింది.
● కందులు 2186 క్వింటాళ్లు రాగా.. కనిష్టంగా రూ.3,089, గరిష్టంగా రూ.7,550 పలికింది. సగటు ధర రూ.6897 నమోదైంది.
● వేరుశనగకు కనిష్ట ధర రూ.5,036, గరిష్ట ధర రూ.8,267 లభించింది.
కర్నూలు సర్కిల్ ఎస్‌ఈకి అదనపు బాధ్యతలు
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్‌గా పని చేస్తున్న బి.బాలచంద్రారెడ్డికి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ సర్కిల్–2 పర్యవేక్షక ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–2 కార్యాలయం పర్యవేక్ష ఇంజనీర్‌గా పని చేస్తున్న పి.రెడ్డి శేఖర్ రెడ్డి గత నెల 31న పదవీ విరమణ పొందారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బి.బాల చంద్రారెడ్డికి మరో సర్కిల్ ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


