పేదల ఇళ్ల పట్టాలపై తమ్ముళ్ల ‘నకిలీ’ముద్ర!
ఓర్వకల్లు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో వివాదం నెలకొంది. లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు నకిలీవని తెలుగు తమ్ముళ్లు ముద్రవేశారు. దీంతో మహిళా లబ్ధిదారులు లబోదిబోమంటూ స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్థానిక నాయకులు గురువారం పేదల స్థలాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, విషయాన్ని వారు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సమాచారం అందజేశారు. నాయకుల సమాచారం మేరకు శుక్రవారం కాటసాని రాంభూపాల్‌రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితిని గమనించారు. దీంతో కాల్వ గ్రామ ప్రజలు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు అక్కడికి చేరుకొని తమ దుస్థితిని వివరించారు.
పేదలకు న్యాయం చేయాలి
ప్రతి నిరుపేద కుటుంబానికి సెంటున్నర స్థలాన్ని ఇవ్వాలని తమ ప్రభుత్వ లక్ష్యం కాగా గ్రామంలోని సర్వే నెంబర్ 63/బిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 400 మందికి ఇళ్ల పట్టాలను 2023లో మంజూరు చేసినట్లు కాటసాని తెలిపారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు సమీపంచడంతో సమయం లేక పట్టాలు పంపిణీ చేశామన్నారు. లేఅవుట్‌లో కొలతలు వేయలేక పోయామని, పేదలకిచ్చిన పట్టాలు నకిలీవి అనడం సమంజసము కాదని మండిపడ్డారు. ఈ విషయంపై తహసీల్దార్ విద్యాసాగర్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేశారు. ఫోన్ పని చేయకపోవడంతో లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయం దగ్గర పంపారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు గంటల తరబడి ఎదురు చూసినా తహసీల్దార్ రాకపోవడంతో కాటసాని మళ్లీ తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. పేదలకిచ్చిన పట్టాలు రికార్డులను పరిశీలించి రెండు, మూడు రోజుల్లోనే న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. అనంతరం స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు, శంకరప్ప, చాంద్‌బాష ఆధ్వర్యంలో పేదలు తహసీల్దార్‌ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా వినతి ప్రతం సమర్పించారు. పేదల ఇళ్లకోసం కేటాయించిన భూమిని సర్వే చేయించి, న్యాయం చేస్తామని కాటసానికి తహసీల్దార్ విద్యాసాగర్ చెప్పారు.
దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం
లబోదిబోమంటున్న మహిళలు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే కాటసాని
నిగ్గుతేల్చాలని అధికారులకు సూచన


