ఉపాధిపై అవగాహనకు 5న గ్రామసభలు
కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న విబి–జి రామ్ జీపై అవగాహనకు ఈనెల 5న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. గ్రామసభలకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధి కూలీలు, మేట్‌లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన ప్రజలు హాజరయ్యేలా చూడాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య ఏపీడీలు, ఏపీవోలకు ఆదేశాలు ఇచ్చారు.
7న ఆప్కాఫ్ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య(ఆప్కాఫ్)కు ఈ నెల 7వ తేదీ ఎన్నికలు జరుగునున్నాయి. ప్రస్తుతం ఈ సమాఖ్యకు ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నవీన్‌కుమార్ పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. మత్స్య శాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈయనతో పాటు వైఎస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రాంప్రసాద్ పోటీ పడే అవకాశం ఉంది. 13 ఉమ్మడి జిల్లాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్యలో డైరెక్టర్లుగా ఉంటారు. వీరిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
అందుబాటులోకి జీవన్‌ప్రమాణ్ పోర్టల్
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్‌దారులు జీవన ప్రమాణ పత్రాలు(లైఫ్ సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేసేందుకు జీవన్ ప్రమాణ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గురువారం కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో జీవన్ ప్రమాణ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగుల నుంచి లైఫ్ సర్టిఫికెట్‌కు ఐరీష్ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు విశ్రాంత ఉద్యోగులు ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్లు సంబంధిత సబ్ ట్రెజరీలకు అప్‌లోడ్ చేయాలన్నారు. కొంతమంది నవంబర్, డిసెంబరు నెలల్లో సమర్పించారని, అవి చెల్లుబాటు కావన్నారు. ఫిబ్రవరి లోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఏప్రిల్ నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారిణి లక్ష్మిదేవి, కర్నూలు సబ్ ట్రెజరీ ఏటీఓ రఘువీర్, ఎస్‌టీఓ విక్రాంత్, కర్నూలు పెన్షనర్ల సంఘం నాయకులు రంగారెడ్డి, జయచంద్రారెడ్డి, గోవిందరాజు, బాలకృష్ణయ్య, విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అహోబిలేశుడికి ప్రత్యేక పూజలు
దొర్నిపాడు: అహోబిలం క్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అధ్యాయన వారోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం తిరువీధుల్లో ఊరేగించారు. అహోబిలం మఠం చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
ఉపాధిపై అవగాహనకు 5న గ్రామసభలు


