ఆ నవ్వులేం పాపం చేశాయ్!
‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ అంటూ నక్షత్రాల గురించి పాడే ఐదేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాట మూగబోయింది. ‘నాన్నా.. నన్ను ఎత్తుకో’ అని చేతులు చాచే ఏడాది వయస్సు ఉన్న బాలుడు సూర్యగగన్ బుడిఅడుగులు ఇక కనిపించవు. తమ్ముడికి అన్నం తినిపిస్తూ.. చెల్లితో కళ్లుమూత ఆట ఆడుతూ.. ఇంటిలో కసువు ఊడ్చే ఎనిమిదేళ్ల కావ్యశ్రీ ఉత్సాహం కనుమరుగైంది. నూతన సంవత్సర వేడుకల్లో గురువారం అందరూ ఆనందంతో ఉన్న వేళ ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామంలోని ఒక ఇంటిలో విషాద గీతం వినిపించింది. తల్లి లేని పిల్లలను రెక్కల కష్టంతో అల్లారుముద్దగా పెంచుకుంటున్న తండ్రికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. క్షణికావేశంలో కూల్‌డ్రింక్‌లో విషమిచ్చాడు. ఈ లోకం గురించి తెలియని చిన్నారులు దానిని తాగి మృత్యువాత పడ్డారు. పిల్లలు లేని లోకం తనకు వద్దని ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారి జ్ఞానేశ్వరి చిరునవ్వును తన పెదవులపై ఉంచుకుని మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. మూడో తరగతి చదివే కావ్యశ్రీ, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే జ్ఞానేశ్వరి, ఇంటి వద్ద ఉంటే జేజమ్మ కృష్ణమ్మకు వచ్చీరాని మాటలు చెప్పే సూర్యగగన్ ఇక కనిపించరు. పిల్లలను భుజాన మోసే తండ్రి వేములపాటి సురేంద్ర కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన నాలుగు రోజుల క్రితం గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మి తన ఇద్దరు పిల్లలను ఎస్సార్బీసీ కాల్వలో తోసి ఆత్మహత్యకు పాల్పడటాన్ని తలపించింది.
– నంద్యాల/ఉయ్యాలవాడ
ముగ్గురు చిన్నారులు మృతి
తండ్రి బలవన్మరణం
తుడుమలదిన్నెలో విషాదం


