ఖైదీల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టండి
కర్నూలు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌కు అర్హత కలిగిన అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టి వారి హక్కుల పరిరక్షణకు పాటు పడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జైలు, ఉప జైలు సూపరింటెండెంట్లు, జైలు విజిటింగ్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీల వివరాలను అండర్ ట్రయల్ ప్రిజనర్ కమిటీ ముందు ఉంచి విడుదలకు సంబంధించిన చర్యలు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష నేరాలకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ఖైదీల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఆర్‌యూకు ఫోర్ స్టార్ రేటింగ్
కర్నూలు (కల్చరల్): ఆంధ్రప్రదే, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ–గవర్నెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌లో రాయలసీమ యూనివర్సిటీ 4 స్టార్ రేటింగ్ సాధించడంపై వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ సంస్థ హైమ్ సర్టిఫికేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం వర్సిటీ వీసీకి ఏడు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వర్సిటీకి సహకరించిన హైమ్ సర్టిఫికేషన్ ప్రతినిధి ఎ.శివయ్య బృందానికి ఆచార్య వెంకట బసవరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఖైదీల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టండి


