హక్కులపై అవగాహన పెంచుకోవాలి
కర్నూలు సిటీ: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ అన్నారు. బుధవారం నగరంలోని కెవిఆర్ కాలేజీలో వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ వినియోగాదారుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జేసీ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వస్తువులు, సేవలను విషయంలో వినియోగదారులు చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్ కొనుగోలు, డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ వస్తువు కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. అనంతరం వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు జేసీ ప్రశంసా పత్రాలు, బహూమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఎం.రాజా రఘువీర్, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు నజ్మా కౌసర్, నారాయణరెడ్డి, ఐఆర్‌ఓ జి.లాలెప్ప తదితరులు పాల్గొన్నారు.


