
శతాధిక వృద్ధురాలు మృతి
కృష్ణగిరి: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బోయ వల్లె మాదమ్మ(115) శుక్రవారం మృతి చెందారు. ఈమె భర్త ఓబన్న కొన్నేళ్ల క్రితమే మృత్యువాతపడ్డారు. మాదమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, మనవళ్లు, మనవరాళ్లకు కూడా వివాహాలయ్యాయి. అంతా కలిపి దాదాపుగా 80 మంది సభ్యులుంటారు. అందరి పెళ్లిళ్లు కళ్లారా చూసిన మాదమ్మ మునిమనవళ్లతో ఆనందంగా గడిపేది. అనారోగ్య సమస్యలతోడు వయోభారం పెరగడంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొన్నేళ్ల క్రితమే పాలపళ్లు కూడా వచ్చాయని వారు తెలిపారు.
48 సెల్ ఫోన్లు రికవరీ
డోన్ టౌన్: చోరీకి గురైన 48 సెల్ ఫోన్లను డోన్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. శుక్రవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఐలు ఇంతియాజ్‌బాషా, సీఎం రాకేష్ మాట్లాడుతూ ఎవరైనా సెల్ ఫోన్లు పోగొంటుకుంటే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబరుతో లేదా వాట్సాప్ ద్వార ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శరత్‌కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ట్రైనింగ్ ఎస్‌ఐ రవ్రికాష్, సిబ్బంది ఉన్నారు.
జ్వరంతో చిన్నారి మృతి
హాలహర్వి: గూళ్యం గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదిలింగ, పవిత్ర దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె దీవెన (03)కు జ్వరం ఎక్కువ కావడంతో గ్రామంలో వైద్యుల వద్ద చూపించినా తగ్గలేదు. దీంతో శుక్ర వారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జ్వరం తీవ్రత మరింత పెరగడంతో కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 11 వేల జనాభా ఉన్న తమ గ్రామంలో సరైన ఆసుపత్రి ఉంటే మా పాప బతికేదని తండ్రి గాదిలింగ రోదిస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని వేదావతి నదిపై బ్రిడ్జిని నిర్మించి ఉంటే కేవలం 20 కి.మీ. దూరంలో బళ్లారి జిల్లా కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లే వారమన్నారు. వంతెన లేకపోవడంతో గూళ్యం–హాలహర్వి–బళ్లారికి వెళ్లేందుకు 45 కి.మీ. పైగా దూరం ఉండటంతో ఆలస్యమై వైద్యం అందక బిడ్డ చనిపోయిందన్నారు.
29న కవి సమ్మేళనం
కర్నూలు కల్చరల్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు టీజీవీ కళాక్షేత్రం సాహితీ వేదికలో తెలుగు కవుల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పత్తి ఓబులయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో పాల్గొనే కవులు తెలుగు భాషలో పద్యం, గేయం, కవిత్వంను మూడు నిమిషాల వ్యవధిలో చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 9989265632 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

శతాధిక వృద్ధురాలు మృతి

శతాధిక వృద్ధురాలు మృతి