
పారిశుద్ధ్య కార్మికులుగా హాస్టల్ బాలికలు
చెత్త వాహనం వద్దకు చెత్త బుట్టలను తీసుకువెళ్తున్న విద్యార్థినులు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు చెందిన విద్యార్థినులు పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ఘటన శుక్రవారం కర్నూలులో చోటు చేసుకుంది. చెత్త సేకరణలో భాగంగా కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన వాహనం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని హాస్టళ్ల వద్దకు వచ్చింది. కలెక్టరేట్ సమీపంలో ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలు మూడు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా వసతి గృహాల్లో వర్కర్లు ఉన్నారో, లేదో తెలియదు కాని, విద్యార్థినులే తమ వసతి గృహాల్లోని చెత్త బుట్టల్లోని చెత్తను వాహనంలోకి వేసేందుకు తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. కాగా, రాయలసీమ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులందరితో సంబంధిత మంత్రి తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సాంఘీక సంక్షేమ శాఖకు చెందిన అధికారులందరు తిరుపతికి వెళ్లడం గమనార్హం.