
చిన్నారులకు కన్నీటి వీడ్కోలు
● చిగిళిలో మిన్నంటిన రోదనలు ● ముగిసిన విద్యార్థుల అంత్యక్రియలు ● నివాళులర్పించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్/ఆస్పరి: ఆడుతూ పాడుతూ అందరినీ నవ్వించే విద్యార్థులు ఆకస్మికంగా మృతి చెందడం.. వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో చిగిళి గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతోనే చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంత్యక్రియల్లో అందరూ పాల్గొన్నారు. విద్యార్థుల మృతదేహాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మౌనం పాటించారు.
విషాద ఛాయలు
చిగిళి గ్రామ చరిత్రలో ఎన్నుడూ లేని విధంగా బుధవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వినయ్, గొల్ల భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం ఎర్రకొండ వద్ద ఉన్న గరుసు కుంటకు వెళ్లారు. దుర్గా ప్రసాద్ తప్ప మిగతా అందరూ ఈతకు కుంటలో దిగి నీటిలో మునిగి మృతిచెందారు. దుర్గా ప్రసాద్ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెండంతో గ్రామం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. గురువారం రోజు గ్రామస్తులంతా తమ పనులకు సెలవు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి దహన సంస్కారాలకు హాజరయ్యారు. మహిళలు రోదనలతో గ్రామం దద్దరిల్లింది. విద్యార్థుల మృతితో గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ గ్రామానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. పత్తికొండ డీఎస్పీ వెంటకరామయ్య రాత్రి గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్, తిరుమల రావు, ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ, జడ్పీహెచ్ స్కూల్ హెచ్‌ఎం రంగప్ప.. పాఠశాలలో ఐదు నిమిషాలు మౌనం పాటించి విద్యార్థులకు సంతాపాన్ని తెలియజేశారు. కుంటలో విద్యార్థులు మృతిచెందడంపై అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు.

చిన్నారులకు కన్నీటి వీడ్కోలు