
ఉరుకుందలో భక్తుల రద్దీ
కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో చివరి గురువారం కావడంతో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచే స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఈరన్న స్వామికి తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. కాగా.. ఈరన్నస్వామి ఆలయం ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి కోసం మాజీ చైర్మన్ చెన్నబసప్ప తన నామినేషన్‌ను గురువారం దాఖలు చేశారు.
25లోపు చౌకదుణాలకు సరుకులు
కర్నూలు(సెంట్రల్): చౌకదుణాలకు ప్రతి నెలా 25వ తేదీలోపు సరుకులను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులను జేసీ డాక్టర్ బి. నవ్య ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్ వెనుక ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి పంపిణీ చేసే నాణ్యమైన 25 కేజీల బియ్యాన్ని పాఠశాలలకు చేర్చాలని ఆదేశించారు. అంతకుముందు హమాలీలకు మంజూరైన యూనిఫాంలను ఆమె అందజేశారు. కార్యక్రమంలో డీఎం వెంకటరాముడు పాల్గొన్నారు.
2,000 హెక్టార్లలో పంటలకు నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): అధిక వర్షాలతో జిల్లాలో 2,000 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు దేవనకొండ, పత్తికొండ, వెల్దుర్తి, క్రిష్ణగిరి, మద్దికెర, ఓర్వకల్లులో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా... ఇప్పటి వరకు 184 మి.మీ.వర్షపాతం నమోదు అయింది. కాగా.. రానున్న నాలుగైదు రోజుల్లో జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
యూరియా కష్టాలు
నందవరం: కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. మండల కేంద్రంలోని గ్రామ సచివాలయానికి గురజాల, రాయచోటి, మిట్టపోమపురం రైతులు గురువారం యూరియా కోసం వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లో నిలిచి అలసిపోయారు. అయితే వ్యవసాయ అధికారులు కేవలం గురజాల గ్రామాల రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేశారు. దీంతో మిగతా రైతులు ఆందోళన చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రైతులు విమర్శించారు. వ్యవసాయ అధికారులు కూడా టీడీపీ నాయకులకు మాత్రమే అందిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నాపరు. రాయచోటి, మిట్టసోమపురం గ్రామాల రైతులందరికీ యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉరుకుందలో భక్తుల రద్దీ