
తీవ్ర నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
● నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని, తీవ్రమైన నేరాలకు పాల్పడే హిస్టరీ షీట్స్ ఉన్నవారిని జిల్లా బహిష్కరణ చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఇందు కోసం సబ్ డివిజన్ల వారీగా పీడీ యాక్ట్ సిద్ధం చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్‌ఐలు ప్రతి క్రైం మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా డీఎస్పీలు చూసుకోవాలన్నారు. ఖైదీల ఎస్కార్ట్‌కు వెళ్లినప్పుడు పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే డిస్మిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా ట్రయల్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌లకు హాజరుకాని రౌడీషీటర్ల వివరాలను పైఅధికారులకు తెలియజేయాలన్నారు. సమస్యాత్మక కాలనీల్లో నిర్బంధ తనిఖీలు, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. నేర నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలన్నారు. కిరాయి హంతకులు, రౌడీషీటర్లను ప్రతి ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
వాట్సప్‌లో తీవ్రమైన ఫిర్యాదులు వస్తే కేసు
మెయిల్ ఐడీ, వాట్సాప్, రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చే ఫిర్యాదులు తీవ్రమైనవని భావిస్తే విచారించి తక్షణమే కేసు నమోదుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీమ్, క్రైం స్పాట్ వాహనాలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, భార్గవితో పాటు సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.

తీవ్ర నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ