
పంట నష్టాన్ని అంచనా వేయండి
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
కృష్ణగిరి/వెల్దుర్తి: ఇటీవల కురిసిన వర్షాలతో పంటలకు నష్టం ఎంత జరిగిందో అంచనా చేయాలని వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో గురువారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. కృష్ణగిరిలోని ఆముదం, ఆయిల్‌పామ్ పంటల సాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ క్రాప్ వేగవంతం చేయాలని, రైతులు నానో యూరియా వాడేలా అవగాహన పెంచాలని, హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువను పరిశీలించారు. పక్కనే ఉన్న మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. గ్రామ సచివాలయం రికార్డులను పరిశీలించి ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె ఆర్‌ఎస్‌కేను తనిఖీ చేసి యూరియా పక్కదారి పట్టకుండా చూడాలంటూ ఆదేశించారు. డీఏఓ వరలక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.