
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: నగరంలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్న ఇ.విశ్వనాథ్ గౌడ్ (35) అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ్ గౌడ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్నూలుకు చేరుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 11వ తేదీన దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. 12వ తేదీ తన భర్త కనిపించడం లేదని భార్య నాగమణి నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని నీళ్లలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి జేబులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వ గట్టుపై విశ్వనాథ్ గౌడ్ ద్విచక్ర వాహనం లభించింది. దీంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.