● దంపతులు, బాలుడికి తీవ్ర గాయాలు
ఎమ్మిగనూరురూరల్: ఆదోని – కర్నూలు రహదారిలో బనవాసి జవహార్ నవోదయ విద్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడికి చెందిన గంగన్న, భార్య భాగ్యలక్ష్మీ కుమారుడు ఉపేంద్రలు ఉదయం స్కూటీపై దేవబెట్ట గ్రామానికి కొత్త బట్టలు పెట్టుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. బట్టలు పెట్టుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తున్నారు. కర్నూలుకు చెందిన దినేష్‌రెడ్డికి కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య ఆదోనిలో ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. ఆ స్కూల్‌లో సెలవు పెట్టి తిరిగి కర్నూలుకు బయలు దేరారు. బనవాసి నవోదయ దగ్గర ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న గంగన్న, భాగ్యలక్ష్మీ, బాలుడు ఉపేంద్రలు ఎగిరి పక్కనే కాలువలో పడిపోయారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్ణవశాత్తు విద్యుత్ స్తంబం విరిగి కింద పడకపోవటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో దంపతులతో పాటు కుమారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.