
సూక్ష్మ సేద్యం పరికరాల ఏర్పాటులో జాప్యం చేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం మంజూరు చేసిన రైతులకు సత్వరం మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు వారి పొలాల్లో అమర్చాలని, ఈవిషయంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులు బిందు, తుంపర్ల సేద్యం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నాన్ సబ్సిడీ కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. 2025–26లో 7000 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 1,450 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించేందుకు పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తున్నాయని, కంపెనీలు కూడా పైపులు, ఇతర పరికరాలు జాప్యం లేకుండా సరఫరా చేయాలని పేర్కొన్నారు. పరికరాల నాణ్యతలో ఏవైన తేడాలు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పత్తి, మిర్చి, ఉల్లి, ఆయిల్‌పామ్ పెద్ద ఎత్తున సాగు అవుతున్నాయని, ఈ పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. పరికరాలు అమర్చడం ద్వారా డ్రిప్ సదుపాయాన్ని వెంటనే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్ ఖాన్ పాల్గొన్నారు.
కంపెనీల ప్రతినిధులకు
ఏపీఎంఐపీ పీడీ ఆదేశం