
జిల్లాకు బంగారు పతకం
కర్నూలు (సెంట్రల్): నీతి అయోగ్ గుర్తించిన ఆస్పిరేషనల్ బ్లాకుల్లో చేపట్టిన సంపూర్ణత అభియాన్ కింద కర్నూలు జిల్లాకు బంగారు పతకం వరించిందని, ఇందుకోసం కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దికెర, చిప్పగిరి, హొళగుంద మండలాల్లో నిర్దేశించిన ఆరు సూచికలు వంద శాతం ప్రగతి సాధించడానికి కారణమైన అధికారులను కలెక్టర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో నీతి అయోగ్ గుర్తించిన 500 ఆస్పిరేషన్ బ్లాకుల్లో జిల్లాలోని మద్దికెర, చిప్పగిరి, హొళగుంద మండలాలు ఎంపికయ్యాయన్నారు. అందులో భాగంగా నీతి అయోగ్ నిర్దేశించిన ఆరు లక్ష్యాలను సాధించడంతో జిల్లాకు గోల్డ్ మెడల్‌తో పాటు అవార్డులు లభించినట్లు చెప్పారు. అంతేకాక మద్దికెర మండలానికి రూ.1.50 కోట్లు, చిప్పగిరి మండలానికి రూ.కోటి నగదు కూడా అభివృద్ధి పనుల కోసం వరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఐ హిమ ప్రభాకర్ రాజు, హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు.