
కొండల రాయుడికి నేడు తేళ్ల నైవేద్యం
ఎక్కడైనా దేవుళ్లకు పాలు, పండ్లు, ఫలహారాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కోడుమూరు కొండపై వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడతారు. ఇక్కడ కొండమీద మాత్రం భక్తులు చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుబొంకులేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం విశేషం.
తేలు కుట్టినా ఏమీ కాదన్న నమ్మకం
స్వామి వారికి సమర్పించేందుకు తేలును పట్టుకునే సమయంలో కుట్టినా ఏమి కాదని భక్తులు చెబుతారు. తేలు కుట్టినపుడు స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందనేది భక్తుల నమ్మకం. కొండపై వెలసిన కొండలరాయుడును దర్శించుకోవాలంటే ప్రజలు కిలోమీటర్‌కుపైగా ఉన్న కొండను కాలినడకన ఎక్కాలి.
– కోడుమూరు రూరల్