
ఆదోని మండలం మండగిరిలో చెత్తకుప్ప వద్ద గుమికూడిన పందులు
మురికి కూపాలుగా మారుతున్న గ్రామాలు
పంచాయతీలకు నిధుల విడుదలలో రాజకీయం
15వ ఆర్థిక సంఘం నిధులకు ఆరు నెలలుగా ఎదురుచూపులు
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై మాత్రమే హడావుడి
45 శాతం మంది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
అధికారులు, ఉద్యోగులు పల్లె బాట పడుతున్న కనిపించని ప్రయోజనం
గ్రామీణ ప్రజలను వెంటాడుతున్న రోగాల భయం
గ్రామీణ ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. గ్రామ పంచాయతీలకు విడుదల కావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు ఈ ఏడాది మార్చి నుంచి గ్రహణం పట్టింది. మేజర్ మినహాయిస్తే, చిన్న పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా నయాపైసా డబ్బులు లేక గ్రామీణ ప్రాంతాల్లో దుర్భక పరిస్థితి నెలకొంది. కనీసం అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా లేకపోవడం వల్ల అనేక గ్రామల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు రోగాల భయం వెంటాడుతోంది.
కర్నూలు(అర్బన్): జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 19 మేజర్ గ్రామ పంచాయతీలు కాగా, మిగిలిన 465 మైనర్ పంచాయతీలే. మేజర్ పంచాయతీల్లో కొద్దోగొప్పో ఆదాయ వనరులు ఉన్న నేపథ్యంలో పలు రకాల పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న పంచాయతీలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాది నవంబర్ నెలలో మొదటి విడతగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.33,12,42,750 విడుదలయ్యాయి. ఇదే అర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత నిధులు ఈ ఏడాది మార్చి నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే నేటి వరకు ఈ నిధులు విడుదల కాకపోవడం వల్ల పల్లెల్లో కనీసం చెత్తను ఎత్తివేసేందుకు కూడా అధికారులు, సర్పంచులు దిక్కులు చూడాల్సి వస్తోంది.
వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు కావడంతోనే జాప్యం
గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడంలో రాజకీయ కుట్ర కోణం దాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మూడు వంతులకు పైగా వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచులే ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పనులు చేపడితే వైఎస్సార్‌సీపీ సర్పంచులకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కూడా కూటమి ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో గతంలో ఎన్నడూ ఇంత జాప్యం జరగలేదని, ఈ ప్రభుత్వంలోనే జాప్యం చోటు చేసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం వల్ల గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులను కూడా చేపట్టలేని పరిస్థితి అనేక పంచాయతీల్లో నెలకొంది.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై హడావుడి
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) కాల్స్ చేస్తోంది. మీ గ్రామంలో వీధులు శుభ్రంగా ఉన్నాయా? ఇంటింటికి వచ్చి చెత్త తీసుకువెళ్తున్నారా? మీ గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్డు ఉపయోగంలో ఉందా? మురుగు కాలువలు శుభ్రంగా ఉన్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి డ్రైన్లు శుభ్రం చేస్తున్నారు? అంటు ప్రజలకు ఫోన్లు చేసి సమాధానాలు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించి జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు కోడి కూయక ముందే గ్రామాలకు వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లోని చెత్తను ఎత్తివేయించేందుకు చర్యలు చేపడతున్నారు. అయినా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో వచ్చే వంద కాల్స్‌లో 55 శాతం మంది పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మిగిలిన 45 శాతం మంది ప్రజలు నెగిటివ్‌గా సమాధానాలు ఇస్తున్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల వివరాలు
మొత్తం గ్రామ పంచాయతీలు: 484
క్లాప్‌మిత్రలు: 1,300
రెగ్యులర్, కాంట్రాక్టు వర్కర్లు: 300
షెడ్ మిత్రలు: 303
అంతంత మాత్రంగా చెత్త సేకరణ
● మెజారిటీ గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● ట్రాక్టర్లను మినహాయిస్తే ఆటోలు, మూడు చక్రాల ట్రై సైకిళ్ల నిర్వహణ లోపం కారణంగా పలు గ్రామ పంచాయతీల్లో మూలన పడ్డాయి.
● ఇంటింటికి వెళ్లి ప్రతి రోజు చెత్తను సేకరించాల్సి ఉన్నా పలు పంచాయతీల్లో సంబంధిత అధికారులు మస్టర్లు వేసేందుకు కూడా తీరిక లేనట్లు వ్యవహరిస్తున్నారు.
● పారిశుద్ధ్య కార్యక్రమాల భారాన్ని శానిటరీ మేసీ్త్రలపై వేసి కార్యాలయాల్లో కాలక్షేపం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
● మేజర్ గ్రామ పంచాయతీల్లోని పలు వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.
● పైగా డ్రైనేజీలను కూడా నిర్ణీత సమయానికి శుభ్రం చేయకపోవడం వల్ల డ్రైన్ల నుంచి మురుగు నీరు రోడ్లపైకి ఎక్కి పారుతోంది.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం
జిల్లాలో పారిశుద్ధ్య సమస్యను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నాం. అలాగే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై ఎప్పడికప్పుడు స్పందించి ఆయా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నాం. ప్రతి రోజు ఉదయమే జిల్లాలోని ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. అలాగే పల్లె ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంలో భాగంగా నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయిస్తున్నాం.
– జి.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి
న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే వైఎస్సార్‌సీపీ సర్పంచులకు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,320 కోట్లను ఇతర అవసరాలకు కూటమి ప్రభుత్వం వాడుకున్నట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వ విడత నిధులే ఇప్పటి వరకు విడుదల కాకుంటే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఎప్పుడు విడుదల అవుతాయో? గ్రామాల్లో తాము చేసిన పనులకు సంబంధించి బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.
– కె.కేశవరెడ్డి, సర్పంచ్, చిన్నహుల్తి, పత్తికొండ మండలం