
రవీంద్ర విద్యార్థులకు జాతీయ స్థాయి బహుమతులు
కర్నూలు సిటీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన స్టీమ్ ఇన్నోవేషన్ లీగ్ 2కే 25 ‘‘ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ అండ్ రోబోటిక్స్ కాంపిటీషన్ ఫోకస్డ్ అరౌండ్ ఇన్నోవేషన్’’ పేరుతో నిర్వహించిన పోటీలలో స్థానిక అబ్బాస్‌నగర్‌లోని రవీంద్ర పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారు. ఈ మేరకు గురువారం ఆ స్కూల్‌లో జరిగిన అభినందన కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపక అద్యక్షులు జి.పుల్లయ్య పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 335 జట్లు పోటీల్లో పాల్గొన్నాయని, ఇందులో తమ స్కూల్ విద్యార్థులు హఫీపా, సమీరా, లిఖిత డ్యూయల్ పర్పస్ వీల్ చైర్ స్ట్రెచర్ బెడ్ ఫర్ హాస్పటల్స్ అనే నమూనాను తయారు చేసి జాతీయ స్థాయిలో తృతీయ బహూమతి సాధించారన్నారు. పిల్లల్లో వచ్చే అద్భుతమైన ఆలోచనలు భావితరానికి నాంది పలకాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్, వైస్ చైర్మన్ జి.వంశీధర్ విద్యార్థులను అభినందించారు. కార్యకమంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జ్ వి.రమేష్ రంజిత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.