
పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో విషాదం
● కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతూ తండ్రి మృత్యువాత ● ఎక్సెల్‌ను టెంపో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం
ఓర్వకల్లు: పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని సోమయాజులపల్లె గ్రామం, బేతంచెర్ల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమయాజులపల్లె వెంకటరమణ (60) కుమారుడి పెళ్లి ఈ నెల 13, 14 తేదీల్లో జరిపించేందుకు నిశ్చయం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలను పంచేందుకు ఉదయం ఎక్సెల్ వాహనంపై సోమయాజులపల్లెకు బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో బేతంచెర్ల క్రాస్‌రోడ్డు వద్ద స్వగ్రామం వైపు మలుపు తిరుగుతుండగా.. తెలంగాణా రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన టెంపో వాహనం నంద్యాల వైపు నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో వెంకటరమణ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టెంపో వాహనం మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లి తప్పించుకుపోగా, స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన టోల్‌ప్లాజా సిబ్బంది నన్నూరు టోల్‌ప్లాజా వద్ద టెంపోను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ చెప్పారు. మృతునికి ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు.