
ఆరు పీఏసీఎస్‌లకు అవార్డులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) 62వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన సంఘాలకు అవార్డులు అందజేశారు. 2023–24 సంవత్సరానికి కడిమెట్ల, కొండాపురం, పాములపాడు పీఏసీఎస్‌లు, 2024–25 సంవత్సరానికి సంబంధించి పోలూరు, మద్దికెర, సి.బెళగల్ పీఏసీఎస్‌లకు అవార్డులు లభించాయి. వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆయా సహకార సంఘాల పర్సన్ ఇన్‌చార్జీలు అవార్డులను అందుకున్నారు.
ఓపీఐల పదవీ కాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లా గవర్నమెంట్ ప్రెస్, కర్నూలు డాక్టర్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు ప్రస్తుతం ఉన్న అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ (ఓపీఐ)ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా గవర్నమెంట్ ప్రెస్ సీహెచ్‌బీఎస్ పర్సన్ ఇన్‌చార్జీ పదవీ కాలం మార్చి 5వ తేదీతో ముగిసింది. పదవీ కాలాన్ని ఆ రోజు నుంచి సెప్టెంబరు 4 వరకు పొడిగించింది. కర్నూలు డాక్టర్స్ సీహెచ్‌బీఎస్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జీ పదవీ కాలం ఏప్రిల్ 25వ తేదీతో ముగిసింది. ఆ రోజు నుంచి అక్టోబరు 24 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం వేరువేరు జీవోలు జారీ చేసింది.
11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా
కర్నూలు కల్చరల్: ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 11న బి.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) కళాశాలలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. నిరుద్యోగులు ఆన్‌లైన్ పోర్టల్ http://apprenticeshipindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు
గుర్తింపు కార్డులు
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులతో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర ప్రయోజనాలు అందుకోవచ్చని తెలిపారు. జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారి రాయిస్ ఫాతిమా పాల్గొన్నారు.
దత్తత ప్రక్రియ త్వరగా
పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. డివిజన్ల వారీగా సాధించిన పురోగతిపై ఆదోని సబ్ కలెక్టర్.. పత్తికొండ, కర్నూలు ఆర్డీఓలతో సమీక్షించారు. బంగారు కుటుంబాలకు ఏఏ అవసరాలు ఉన్నాయన్న నీడ్ అసెస్‌మెంట్ సర్వేపై కూడా కలెక్టర్ సమీక్షించగా ఎమ్మిగనూరు, ఓర్వకల్, హలహర్వి మండలాలు తప్ప మిగిలిన మండలాలన్నీ వెనకబడ్డాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిలో ఒక్క శాతం, కోసిగి, మంత్రాలయం, సీబెళగల్, దేవనకొండ మండలాల్లో అసలు పురోగతే సాధించలేదని, సంబంధిత మండలాల అధికారులకు షోకజ్ నోటీసులు ఇవ్వాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్‌నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ హిమప్రభాకరరాజు పాల్గొన్నారు.