
అధిక ఫీజు వసూళ్లపై విచారణ
ఎమ్మిగనూరుటౌన్: నిబంధనలు పాటించకుండ విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై పట్టణంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై శనివారం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి విచారణ జరిపారు. ఇందులో భాగంగా స్థానిక భాష్యం పాఠశాలలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసిన వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ కవితను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌టీఈ యాక్ట్ కింద విద్యార్థులకు ఎన్ని సీట్లు కేటాయించారని, వారిని ఫీజులెందుకు అడిగారని ప్రశ్నించారు. పాఠశాలలో ఫీజు పట్టికను నోటీసు బోర్డ్‌లో ఎందుకు ప్రదర్శించ లేదని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఎంఈఓలు ఆదేశించినా ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని జైభీమ్ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట ఎంఈఓ 2 మధుసూదన్‌రాజు తదితరులు ఉన్నారు.