
సైనికులకు జోహార్లు
కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్‌లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్‌తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్‌రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే
కఠిన చర్యలు
● ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు
డీఈఓ హెచ్చరిక
కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గత నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించామన్నారు. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను అడ్మిషన్లకు క్యాంపెయిన్ చేయిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రచార నిమిత్తం ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్ల తనిఖీలకు ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు వచ్చిన సమయంలో సరైన సమాచారం అందించాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రంలో తారాస్థాయికి
కక్ష రాజకీయాలు
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారా స్థాయికి చేరాయని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు వేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. తాజాగా మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వ అధికారులపైనా చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతున్నారన్నారు. ఆయన కుట్రపూరిత చర్యలతో రాష్ట్రాన్ని, ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకపోగా, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారన్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.